సీఎన్‌ఆర్ రావుకు చైనా అవార్డు
2012 సంవత్సరానికి ‘చైనా అకాడెమీ ఆఫ్ సెన్సైస్’ అవార్డుకు ప్రముఖ శాస్త్రవేత్త, భారత ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలి చైర్మన్, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(బెంగళూరు) గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సీఎన్‌ఆర్ రావు ఎంపికయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష కషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని చైనా ప్రదానం చేస్తుంది. సీఎన్‌ఆర్ రావుతోపాటు జర్మన్ జీవ శాస్త్రవేత్త హెర్బర్ట్ జాకల్, రష్యన్ అంతరిక్ష శాస్త్రవేత్త జి.ఎ.జెరెబ్‌త్సోవ్‌లకు కూడా ఈ అవార్డు లభించింది. రసాయనిక శాస్త్రవేత్త అయిన సీఎన్‌ఆర్ రావు పూర్తిపేరు చింతామణి నాగేశ రామచంద్రరావు.
పద్మ అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను జనవరి 25న ప్రకటించింది. మొత్తం 108 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. నలుగురికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 80 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వీరిలో 24 మంది మహిళలు ఉన్నారు. వివరాలు..
పద్మవిభూషణ్: రఘునాథ్ మహాపాత్ర (ప్రఖ్యాత శిల్పి, ఒడిశా); ఎస్.హైదర్ రజా (చిత్రకారుడు, ఢిల్లీ); ప్రొఫెసర్ యశ్‌పాల్ (భౌతిక శాస్త్రవేత్త, ఉత్తరప్రదేశ్); ప్రొఫెసర్ రొద్దం నరసింహ (అంతరిక్ష శాస్త్రవేత్త, కర్ణాటక)
పద్మభూషణ్: డాక్టర్ కనక్ రేలే (ఆర్ట్- మహారాష్ట్ర), షర్మిలా టాగూర్ (ఆర్ట్- ఢిల్లీ), రాజేశ్‌ఖన్నా (మరణానంతరం-ఆర్ట్, మహారాష్ట్ర), జస్పాల్ భట్టీ (మరణానంతరం-ఆర్ట్, పంజాబ్), డాక్టర్ ఎ.శివథాను పిళ్లె (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), డాక్టర్ విజయ కుమార్ సారస్వత్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), ప్రొఫెసర్ సత్య ఎన్. అట్లూరి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- యూఎస్‌ఏ), ప్రొఫెసర్ జోగేష్ చంద్రపతి (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- యూఎస్‌ఏ), రాహుల్ ద్రావిడ్ (క్రీడలు-కర్ణాటక), మేరీకామ్ (క్రీడలు-మణిపూర్).
పద్మశ్రీ: నానా పటేకర్ (ఆర్ట్-మహారాష్ట్ర), అవినాష్ చందర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఢిల్లీ), ప్రొఫెసర్ సంజయ్ గోవింద్ ధాండే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- ఉత్తరప్రదేశ్), ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ కుమార్ పాల్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్- పశ్చిమ బెంగాల్) తదితరులు.
మన రాష్ట్రం నుంచి పద్మ అవార్డులు పొందిన వారు: పద్మభూషణ్: డి.రామానాయుడు (సినీ నిర్మాత). పద్మశ్రీ: గజం అంజయ్య (ఆర్ట్), రేకందర్ నాగేశ్వరరావు అలియాస్ సురభి బాబ్జీ (ఆర్ట్), డాక్టర్ ముదుండి రామకష్ణరాజు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ జయరామన్ గౌరీశంకర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ అలియాస్ చిట్టా వెంకట సుందర రామ్ (వైద్యం), డాక్టర్ రాధిక హర్జ్‌బెర్గర్ (సాహిత్యం, విద్య). వీరుగాక.. రాష్ట్రానికి చెందిన సినీ ప్రముఖులు ఎస్.జానకి (తమిళనాడు- పద్మభూషణ్, ఈమె పురస్కారాన్ని తిరస్కరించారు), బాపు (తమిళనాడు-పద్మశ్రీ), శ్రీదేవి (మహారాష్ట్ర-పద్మశ్రీ)లకు ఇతర రాష్ట్రాల కోటాలో పద్మ అవార్డులు లభించాయి.
మేజర్ అనూప్‌కు కీర్తి చక్ర
అత్యున్నత శౌర్య పతకాల్లో రెండోదైన ‘కీర్తి చక్ర’ పురస్కారం ఈ ఏడాది మేజర్ అనూప్ జోసఫ్ మంజలీకి లభించింది. జమ్మూకాశ్మీర్‌లో దేశరక్షణ కోసం వీరోచితంగా పోరాడినందుకు ఈ అవార్డు దక్కింది. విధి నిర్వహణలో అమరులైన నలుగురు జవాన్లు సహా 11 మందిని ‘శౌర్య చక్ర’ పతకానికి ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన అమర జవాన్లలో గత ఏడాది కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద భారత చెక్‌పోస్ట్‌పై దాడిని తిప్పికొట్టిన రాజేశ్వర్ సింగ్, అనిల్‌కుమార్, సహాయకచర్యల్లో ప్రాణత్యాగం చేసిన ఎ.రాహుల్ రమేశ్, కాంగోలో తిరుగుబాటుదారులతో పోరాడి అమరుడైన క్రిషన్ కుమార్ ఉన్నారు. ఈ ఏడాది అత్యున్నత శౌర్యపతకం ‘అశోక చక్ర’కు ఎవరూ ఎంపిక కాలేదు.
ఎన్నికల సంఘం అవార్డులు
ఉత్తమ ఓటర్ల విధానాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన కషికిగాను గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు 2012 సంవత్సరానికి ఎన్నికల సంఘం అవార్డులు దక్కాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఆసియా నోబెల్ ప్రెజ్ ఏర్పాటు
తైవాన్ వ్యాపారవేత్త సామ్యూల్ ఇన్ ఆసియా నోబెల్‌గా పేర్కొనే ‘ట్యాంగ్ ప్రెజ్’ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఈయన 101 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. 2014లో ప్రారంభమయ్యే ఈ బహుమతిని ప్రతి రెండేళ్లకోసారి ఇస్తారు. ‘నిరంతర అభివద్ధి’, ‘జీవ ఔషధ తయారీ’, ‘చైనా భాష చరిత్ర అధ్యయనం’, ‘చట్టబద్ధ పాలన’ అనే నాలుగు విభాగాల్లో జాతీయతతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా అందజేస్తారు. ప్రతి కేటగిరీలో విజేతకు 1.7 మిలియన్ డాలర్లు ఇస్తారు. ప్రస్తుతం నోబెల్ విజేతలకు 1.2 మిలియన్ డాలర్లు ఇస్తున్నారు.
రాష్ట్ర మహిళా రైతుకు అంతర్జాతీయ అవార్డు
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధి కోఠివారి అగ్రహారానికి చెందిన గరిమెళ్ల మైథిలి అంతర్జాతీయ స్థాయి మహిళా రైతు అవార్డుకు ఎంపికయ్యారు. సేద్యంలో ‘విస్తరణ ప్యూహాలు, జీవన విధానం పెంపుదల’ అంశం ఆధారంగా మైథిలిని నాగపూర్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి నలుగురు ఈ అవార్డుకు ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా రైతు విభాగంలో మైథిలి మాత్రమే ఎంపికయ్యారు.
గుళ్లపల్లికి నౌమన్ అవార్డు
ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావును ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్తమాలజీ ‘జీ ఓ హెచ్ నౌమన్’ అవార్డుతో సత్కరించింది. జనవరి 19న గుళ్లపల్లి ఈ అవార్డును స్వీకరించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్తమాలజీ మాజీ అధ్యక్షుడు, ప్రఖ్యాత జర్మనీ నేత్ర వైద్యుడు నౌమన్ పేరుతో ఇచ్చే ఈ పురస్కారాన్ని నేత్ర సంరక్షణలో అత్యుత్తమ కషికి గుర్తింపుగా గుళ్లపల్లి ఎన్ రావుకు అందించారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
2013 సంవత్సరానికి 58వ ఫిల్మ్ ఫేర్ అవార్డులను జనవరి 21న ముంబైలో ప్రదానం చేశారు.వివరాలు..
ఉత్తమ చిత్రం-బర్ఫీ
ఉత్తమ నటుడు-రణ్‌బీర్ కపూర్ (చిత్రం: బర్ఫీ)
ఉత్తమ నటి-విద్యాబాలన్ (చిత్రం: కహానీ)
ఉత్తమ దర్శకుడు- సుజోయ్ ఘోష్ (చిత్రం: కహానీ)
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- యశ్ చోప్రా (మరణానంతరం).
కృషి కర్మన్ అవార్డులు
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 15న ‘కషి కర్మన్’ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు పొందిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, నాగాలాండ్, మణిపూర్. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచినందుకు ఉత్తరప్రదేశ్ (తణధాన్యాలు), బీహార్ (ధాన్యం), జార్ఖండ్ (పప్పు ధాన్యాలు), హర్యానా (గోధుమ) బహుమతులు పొందాయి. తమిళనాడుకు చెందిన టి. అమలరాణి, పి. సొలైమలైకు ఉత్తమ రైతు అవార్డులు దక్కాయి.
మలాలాకు ఫ్రాన్స్ పురస్కారం
పాకిస్థాన్ సాహస బాలిక, మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జై (15)కు ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక పురస్కారం ‘సైమన్ డీ బేవియర్’ దక్కింది. జనవరి 9న ప్యారిస్‌లో మలాలా తరపున ఆమె తండ్రి జియావుద్దీన్ యూసుఫ్‌జై ఈ అవార్డును అందుకున్నారు. బాలికల చదువు కోసం ప్రచారం చేస్తున్న మలాలాపై గతేడాది పాకిస్థాన్‌లో తాలిబన్లు కాల్పులు జరిపారు.
బెనగల్‌కు అక్కినేని అవార్డు
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ‘2012 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. సామాజిక స్పృహ, మానవ హక్కుల నేపథ్యంలో అంకుర్, భూమిక, త్రికాల్, నిషాన్ వంటి ఎన్నో విలువైన చిత్రాలను ఈయన రూపొందించారు. 2005లో నెలకొల్పిన ఈ అవార్డును తొలిసారి ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు ప్రదానం చేశారు. 2011లో బాలీవుడ్ నటి హేమమాలినికి ఈ పురస్కారాన్ని అందజేశారు.
ముత్తునాయగం, సారస్వత్‌లకు ‘ఆర్యభట్ట’
ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు 2010, 2011 సంవత్సరాలకు వరుసగా.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఏఈ ముత్తునాయగం, వీకే సారస్వత్‌లకు లభించింది. ముత్తునాయగం కేంద్ర సముద్ర అభివద్ధిశాఖ కార్యదర్శిగా, ఇస్రోలో ద్రవీకత ఇంధన వ్యవస్థ కేంద్రం డెరైక్టర్‌గా సేవలందించారు. సారస్వత్ ప్రస్తుతం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) డెరైక్టర్ జనరల్‌గా, రక్షణ శాఖ ప్రధాన శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్నారు. |
No comments:
Post a Comment
Type here: