ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో 24 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దక్షి ణ బస్తర్ ప్రాంతంలో మే 25న మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మరికొద్ది నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పరివర్తన్ యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా జరిగిన సభలో పాల్గొని వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చి, ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి పలువురు నేతలను హతమార్చారు. వీరిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, పలువురు నేతలు ఉన్నారు.
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
నావికాదళ నూతన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తర్కష్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. గోవా తీరంలో మే 22న నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత మార్గంలో ప్రయాణించి బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎ.శివథానుపిళై ్ల వెల్లడించారు.
గుర్గావ్‌లో తొలి రక్షణ విశ్వవిద్యాలయం
హర్యానాలోని గుర్గావ్‌లో బినోలా వద్ద ఏర్పాటు చేస్తున్న తొలి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 23న శంకుస్థాపన చేశారు. ఐఐటీ, ఐఐఎం స్థాయిల్లో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం 2018నాటికి పనిచేయడం ఆరంభిస్తుంది. ఇందులో రక్షణ అధ్యయనాలు,రక్షణ నిర్వహణ,రక్షణకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీల్లో ఉన్నత విద్యను అందిస్తారు. ఇం దులో సైనిక దళాల నుంచి 66 శాతం, ఇతర ప్రభుత్వ సంస్థ ల నుంచి 33 శాతం విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
మలయాళంకు ప్రాచీన భాష హోదా
మలయాళం భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ మే 23న నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3.33 కోట్ల మంది మలయాళం మాట్లాడేవారున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన నాలుగో భాష మలయాళం. ఇప్పటికే తమిళం, కన్నడం, తెలుగు భాషలకు ఈ హోదా దక్కింది. ఈ హోదా వల్ల మలయాళం భాష, సాహిత్యాలను ప్రోత్సహించేందుకు అనేక ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. కేంద్రం నుంచి రూ. 100 కోట్ల సహాయం దక్కుతుంది. అంతేకాకుండా వివిధ విశ్వవిద్యాలయాల్లో మలయాళం పీఠం ఏర్పాటు చేసేందుకు యూజీసీ తోడ్పడుతుంది.
పిల్లల గల్లంతుపై సుప్రీం మార్గదర్శకాలు
గల్లంతైన పిల్లలతోపాటు ఇతర నేరాలకు బాధితులైన బాలల రక్షణకు సంబంధించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. బచ్‌పన్ బచన్ ఆందోళన్ (బీబీఏ) అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల గల్లంతు, వారి అక్రమ తరలింపు సమస్యలపై దాఖలు చేసిన పిటిషన్‌ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశంలో 2009-11 కాలంలో 75,808 మంది పిల్లలు కనిపించకుండా పోయినట్లు గణాంకాలు చెబుతుండగా, పిల్లల గల్లంతుకు సంబంధించి ఇంతవరకు నమోదుకాని కేసుల్లో నెల్లాళ్ల వ్యవధిలోనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తగిన ఆధారాలు లభించేంత వరకు పిల్లల గల్లంతు కేసులన్నింటినీ కిడ్నాప్ కేసులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. బాలలపై నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లోను సుశిక్షితుడైన అధికారిని బాలల సంక్షేమ అధికారిగా నియమించాలని ఆదేశించింది.
ఢిల్లీలో 45వ భారత కార్మిక సదస్సు
45వ భారత కార్మిక సదస్సు ఢిల్లీలో మే 17న జరిగింది. ఈ సదస్సును ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2004 నుంచి 2010 వరకు ప్రభుత్వం 20 మిలియన్ల అదనపు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఇదే కాలంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిందన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా (కె.జి. సేన్‌గుప్తా) నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మే 21న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తాతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు జస్టిస్ సేన్‌గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1953లో కోల్‌కతాలో జన్మించిన జస్టిస్ సేన్‌గుప్తా 1981లో న్యాయవాద వృత్తిని చేపట్టారు.
గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్‌వర్క్స్.. ‘గూగుల్ ఇండియా’తో ఓ అవగాహన ఒప్పందంపై మే 14న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద ఇంజనీరింగ్ విద్యార్థులకు, బోధకులకు గూగుల్ శిక్షణ ఇస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గూగుల్ సంస్థ ప్రతినిధి నెల్సన్ మట్టోస్ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. గూగుల్.. దేశంలో విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ఆధునిక టెక్నాలజీల్లో గూగుల్ శిక్షణ ఇస్తుంది. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం
కర్ణాటక శాసనసభకు మే 5న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను 121 స్థానాలను కైవసం చేసుకుంది (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలు సరిపోతాయి). అధికార బీజేపీకి 40 స్థానాలు మాత్రమే దక్కాయి. మాజీ ప్రధాని దేవెగౌడ నేతత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చెందిన కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ)కి ఆరు స్థానాలు దక్కాయి. మరో ప్రాంతీయ పార్టీ బీఎస్‌ఆర్‌సీపీకి నాలుగు స్థానాలు లభించాయి. 2008 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్‌కు అదనంగా 2.46 శాతం మేర ఓట్లు వచ్చాయి. బీజేపీ దాదాపు 13.4 శాతం ఓట్లను కోల్పోయింది.
మొత్తం స్థానాలు: 224
ఎన్నికలు జరిగిన స్థానాలు: 223
గెలిచిన స్థానాలు | | (ఓట్ల శాతం) |
కాంగ్రెస్: | 121 | (36.55) |
బీజేపీ: | 40 | (19.97) |
జేడీఎస్: | 40 | (20.09) |
ఇతరులు: | 22 | (-) |
2008 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80, బీజేపీకి 110, జేడీఎస్‌కు 12, ఇతరులకు 6 స్థానాలు దక్కాయి.
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య
కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 13న ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా సిద్ధరామయ్యను మే 10న పార్టీ శాసనసభ్యులు ఎన్నుకున్నారు.
19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణ
దేశంలో అనేక ప్రాంతాల్లో 19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 4.87 లక్షల హెక్టార్లు, అస్సాంలో 3.30 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.57 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 1.83 లక్షల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది. ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో లక్ష హెక్టార్ల చొప్పున ఆక్రమణలో ఉంది. గోవా, లక్షదీవులు, పుదుచ్చేరిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదు.
కేంద్ర రైల్వే, న్యాయశాఖల మంత్రుల రాజీనామా
కేంద్ర రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్, న్యాయశాఖా మంత్రి అశ్వనీకుమార్‌లు మే10న తమ పదవులకు రాజీనామా చేశారు. అశ్వనీకుమార్, బన్సల్ రాజీనామాల నేపథ్యంలో వారి శాఖలను ఇతర మంత్రులకు అదనంగా కేటాయించారు. కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి కపిల్ సిబల్‌కు న్యాయశాఖ, రవాణా శాఖ మంత్రి సీపీ జోషికి రైల్వే శాఖను అప్పగించినట్లు రాష్ట్రపతిభవన్ మే 11న ప్రకటించింది.
జల సంరక్షణ సంవత్సరంగా 2013
2013ను జల సంరక్షణ సంవత్సర ంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ మే 9న ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరులో ఆమోదించిన జాతీయ జలవిధాన కార్యాచరణలో భాగంగా జల సంరక్షణ సంవత్సరానికి పచ్చజెండా ఊపింది. ఏడాదంతా కేంద్ర జలవనరుల శాఖ నీటి పొదుపుపై పెద్దపెత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది.
పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం
పార్లమెంటు ప్రాంగణంలో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని మే 7న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు.. రాజ్యసభ ఔటర్ లాబీ ముఖద్వారం వద్ద ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
భారీ ఓడరేవుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో భారీ ఓడరేవుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ రెండు ఓడరేవుల నిర్మాణానికి రూ.15,820 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 5.40 కోట్ల టన్నుల నిర్వహణ సామర్థ్యంగల ఓడరేవును నిర్మిస్తారు. దీనికి రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులు అవసరం. ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే కేంద్రం దుగరాజపట్నంపై మొగ్గుచూపింది. కొత్త ఓడరేవులను ప్రభుత్వ, ప్రెవేటు భాగస్వామ్యంతో చేపడతారు. వీటి నిర్మాణాన్ని కేంద్రం నోటిఫై చేయనుంది.
-భారీ ఓడరేవులు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. చిన్న ఓడరేవులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయి.
-దేశంలో ప్రస్తుతం 12 భారీ ఓడరేవులున్నాయి. అవి.. కోల్‌కతా-హల్దియా, పారాదీప్, విశాఖపట్నం, ఎన్నోర్, చెన్నై, వీవో చిదంబరనార్ (గతంలో ట్యుటికోరన్), కోచి, న్యూ మంగళూరు, మార్మగోవా, ముంబై, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కాండ్లా.
పర్యావరణ సూచీలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశంలో పర్యావరణ నిర్వహణ సూచీ (ఈపీఐ)-2012లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. నాణ్యమైన గాలి; నీరు, అటవీ సంరక్షణకు; చెత్త నిర్వహణకు అత్యుత్తమ పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌కు ఈ గుర్తింపు లభించింది. జాబితాలో సిక్కిం రెండో స్థానంలో నిలవగా హిమాచల్‌ప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. హర్యానా (27), బీహార్ (30) స్థానంలో నిలిచాయి. చివరిస్థానం (35)లో లక్షద్వీప్ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు
కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఏప్రిల్ 30న 2011 జనాభా లెక్కలను విడుదల చేశారు. వీటి ప్రకారం
- రాష్ర్ట జనాభా 8.45 కోట్లు(కచ్చితంగా 8,45,80,777).
- 2001 లెక్కలతో పోల్చితే రాష్ర్ట జనాభా 11శాతం పెరిగింది.
- ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు.
- గ్రామీణ జనాభా 5,63,61,702
- పట్టణ జనాభా 2,82,19,075.
- అత్యధిక జనాభా ఉన్న జిల్లా-రంగారెడ్డి (27,41,239).
- అత్యల్ప జనాభా ఉన్న జిల్లా-విజయనగరం (23,44,474).
- స్త్రీ, పురుష నిష్పత్తి: 992/1000
- ఆరేళ్లలోపు పిల్లల్లో లింగ నిష్పత్తి- 939/1000
- జన సాంద్రత: 307
- అక్షరాస్యత- 67.02 శాతం (మహిళలు 59.15 శాతం, పురుషులు-74.88 శాతం)
- అక్షరాస్యతలో ప్రథమ స్థానం హైదరాబాద్(75.87 శాతం)
- అక్షరాస్యతలో చివరి స్థానంలో మహబూబ్‌నగర్- 55.04 శాతం
- రాష్ర్టంలో ఎస్టీలు- 6.59 శాతం
- రాష్ర్టంలో ఎస్సీలు- 16.41 శాతం
రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్‌ను మే 4న ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌కు రాష్ట్ర హోం మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రజా భద్రతా పర్యవేక్షణ, వ్యవస్థలో లోపాలను తొలగించడం వంటి విధులను ఈ కమిషన్ నిర్వర్తిస్తుంది. విధానపరమైప నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాల నిస్తుంది. పోలీసుల ఉత్తమ పనితీరుకు, వ్యవస్థాపరమైన లక్ష్యాలకు సంబంధించి ముందస్తు చర్యలకు సలహాలివ్వడం, పోలీసుల వత్తి పరమైన విధానాలకు సంబంధించి కూడా ఈ కమిటీ సూచనలిస్తుంది. ఇది జాతీయ స్థాయిలో ఉన్న ‘జాతీయ భద్రత మండలి’ మాదిరిగా రాష్ట్రస్థాయిలో పనిచేస్తుంది.
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)కు కేంద్ర కేబినెట్ మే1న ఆమోదం తెలిపింది. పట్టణ పేదల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు అనుబంధ కార్యక్రమంగా చేపడతారు. దేశవ్యాప్తంగా 50,000 పైగా జనాభా ఉన్న 779 నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీని వల్ల 7.75 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యక్రమం కింద ఐదేళ్లలో రూ. 22,507 కోట్లు వ్యయం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యయాన్ని 75:25 నిష్పత్తిలో పంచుకుంటాయి. ఇందులో కేంద్రం వాటా రూ.16,955 కోట్లు.
121 కోట్లకు చేరుకున్న భారత్ జనాభా
కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఏప్రిల్ 30న 2011 జనాభా లెక్కలను విడుదల చేశారు. వీటి ప్రకారం భారత జనాభా మార్చి 1 నాటికి 121,07,26,932. - 2001 జనాభా లెక్కలతో పోల్చితే పెరిగిన జనాభా 18.196 కోట్లు.
- 2001-11 మధ్య కాలంలో పెరిగిన జనాభా 17.7 శాతం (అంతకుముందు దశాబ్దంలో పెరిగిన జనాభాశాతం 21.5)
- దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 83.85 కోట్ల మంది నివసిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 37.71 కోట్ల మంది ఉన్నారు.
- అక్షరాస్యత శాతం 73. ఇది 2001లో 64.8 శాతం.
- లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2001లో ఇది 933.
అదనపు సొలిసిటర్ జనరల్ రాజీనామా
అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జి) హరేన్ రావల్ ఏప్రిల్ 30న తన పదవికి రాజీనామా చేశారు. బొగ్గు కుంభకోణంపై ిసీబీఐ స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టుకు ఆయన తెలిపిన సమాచారం అసత్యమని తేలడంతో రావల్ రాజీనామా చేశారు. 2009 జూలై 4 నుంచి ఆయన ఏఎస్‌జీగా ఉన్నారు.
కూడంకుళంకు సుప్రీం అనుమతి
వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. రక్షణ ఏర్పాట్లు బాగానే ఉన్నాయని నిపుణుల కమిటీ నిర్థారించినందున అనుమతిని ఇస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. దీర్ఘకాల ప్రయోజనాలు, దేశ ఆర్థిక వద్ధి దష్ట్యా కూడంకుళం అవసరమని అభిప్రాయపడింది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు అన్ని అనుమతులు సాధించాకే ఉత్పత్తిని ప్రారంభించాలని స్పష్టం చేసింది. 15 మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సందర్భంగా కూడంకుళానికి వ్యతికేకంగా ఉద్యమించిన వారందరిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆదేశించింది |
No comments:
Post a Comment
Type here: