Thursday, November 20, 2014

APTET AND TRT2014 ( DSC2014) IMPORTANT DAYS

ఉపాధ్యాయ నియామక పరీక్షలు

ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక ప్రకటన-2014ను నవంబర్ 21న (శుక్రవారం) జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 9,061 ఉపాధ్యాయ పోస్టులను టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్-టీచర్స్ రిక్రూట్‌మెంట్ (టెట్ కమ్ టీఆర్టీ) పేరుతో భర్తీ చేయనున్నామని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నవంబర్ 20న (గురువారం) ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. 1849 స్కూల్ అసిస్టెంట్స్, 812 లాంగ్వేజి పండిట్స్, 156 వ్యాయామ విద్య ఉపాధ్యాయులు (పీఈటీ), 6244 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను తాజాగా వెలువడే ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. ఈ నియామక రాత పరీక్షలను 2015 మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి సానుకూలత కనిపించలేదన్నారు. తెదేపా ఎన్నికల ప్రణాళికలో బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనలతో ఈ అంశాన్ని చేర్చామని, వారికి సానుకూలంగా చర్యలు తీసుకునే నిమిత్తం చివరి వరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఇదే అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిగణనలోనికి తీసుకోలేదని చెప్పారు. అందువల్లే ఈ ఏడాది సెప్టెంబరు 5వ తేదీన జరగాల్సిన ప్రకటన జారీలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన అనంతరం పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన విద్యా శాఖ ద్వారానే కార్యరూపం దాల్చబోతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామక పరీక్షను డీఎస్సీగా వ్యవహరించేవారు. ఇకపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని, టెట్ కమ్ టీఆర్టీలోనే అంతర్భాగంగా ఉంటుందని మంత్రి చెప్పారు. దీనివల్ల అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి హైదరాబాద్, ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని చెప్పారు. 2015-16 విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఈ నియామకాలు జరుగుతాయని చెప్పారు. మున్సిపల్, గిరిజన శాఖల తరఫున నియామకాలు వేరుగా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా వెంటవెంటనే ఉపాధ్యాయ నియామకాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా, విద్యాశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్ రామశంకరనాయక్ పాల్గొన్నారు.
విభాగాలవారీ పోస్టులిలా...
సెకండరీ గ్రేడ్ టీచర్స్: 6244
స్కూల్ అసిస్టెంట్: 1849
లాంగ్వేజ్ పండిట్స్: 812
వ్యాయామ విద్య ఉపాధ్యాయులు: 156
ఉపాధ్యాయ నియామక పరీక్షల వివరాలు
* నియామకాల ప్రకటన జారీ - 21.11.2014
* ఏపీఆన్‌లైన్, ఈసేవా ద్వారా రుసుము చెల్లింపు - డిసెంబరు 2 నుంచి 2015 జనవరి 16వ తేదీ వరకు (45 రోజులు)
* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ - డిసెంబరు 3 నుంచి జనవరి 17వ తేదీ వరకు (45 రోజులు)
* హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ వెసులుబాటు - ఏప్రిల్ 25 నుంచి...
* రాతపరీక్షలు - మే 9(ఎస్జీటీ),- మే 10 (లాంగ్వేజ్ పండిట్),- మే 11 (స్కూల్ అసిస్టెంట్)
* ప్రాథమిక కీ విడుదల - మే 18
* ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ - మే 19 నుంచి 25 వరకు
* తుది కీ విడుదల - మే 27
* ఫలితాల వెల్లడి - మే 28

No comments: