బావుల్లో తగ్గినా... బంకుల్లో
తగ్గదేం?
ఆరునెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్)
బ్యారెల్ ధర అడ్డూ అదుపూ లేకుండా పడిపోతూనే ఉంది.
ఎంతలా అంటే... ఈ ఆరునెలల వ్యవధిలోనే ఏకంగా 115 డాలర్ల
నుంచి 50 డాలర్లకు వచ్చేసింది. మరింత పతనం ఖాయమన్న
సంకేతాలు కూడా వస్తున్నాయి? ఎందుకిలా..?
అసలేం జరుగుతోంది? ఈ పతనానికి కారణాలేంటి?
దేశానికి అవసరమైన ముడి చమురులో 80 శాతానికి పైగా విదేశాల
నుంచే దిగుమతి చేసుకుంటున్న భారతదేశానికి ఈ
పరిణామం లాభమేనా? మరి విదేశాల నుంచి దిగుమతి
చేసుకుంటున్న ధర 60 శాతానికి పైగా తగ్గినా మన బంకుల్లో
మాత్రం ఆ మేరకు తగ్గటం లేదెందుకు? అంతర్జాతీయంగా
ధరలు పెరిగినపుడు ఆ పెరుగుదలను భరించిన పెట్రోల్, డీజిల్
వినియోగదార్లకు ఈ
తగ్గింపు ప్రయోజనం ఎందుకు అందటం లేదు?
అసలు ముడి చమురు విషయంలో ఏం జరుగుతోంది? ‘సాక్షి’
బిజినెస్ విశ్లేషణాత్మక కథనం...
భారీగా పడుతున్న అంతర్జాతీయ క్రూడ్ ధర
⇒ ఆరునెలల్లో బ్యారెల్ రేటు 115 డాలర్ల నుంచి 50 డాలర్లకు
⇒ భారత దిగుమతుల బిల్లు తగ్గినా పెట్రోల్, డీజిల్
రేట్లు తగ్గలేదు
⇒ ఈ లాభంలో కొంత ఎక్సైజ్ సుంకానికి; కొంత
చమురు కంపెనీలకు
⇒ అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తి పెరగటమే ధర పతనానికి కారణం
⇒ ఆర్థిక మాంద్యంతో జపాన్; యూరప్ తదితర దేశాల్లో తగ్గిన
డిమాండ్; ఉత్పత్తి తగ్గించని ఒపెక్
తొమ్మిదేళ్ల కిందట.. అంటే 2005-06లో క్రూడ్ బ్యారెల్ ధర 55
డాలర్లు. తరవాత పెరిగినా మళ్లీ 2009 జనవరి- ఫిబ్రవరిల్లో మళ్లీ 50
డాలర్ల స్థాయికి వచ్చింది. కాకపోతే బంకుల్లో రిటైల్ ధరకు వచ్చేసరికి
2005లో పెట్రోలు లీటరు రూ.43, డీజిల్ రూ.30 ఉండేవి. 2009
జనవరిలో కూడా అంతే ఉన్నాయి. పెట్రోలు లీటరు రూ.40, డీ జిల్
రూ.30. అంతే!! దీనర్థం అంతర్జాతీయంగా బ్యారెల్ 50 డాలర్ల
దగ్గరుంటే మనకు లీటరు పెట్రోలు రూ.40కి, డీజిల్ రూ.30కి
రావాలి. కాకపోతే దిగుమతుల కోసం మనం డాలర్లు వెచ్చిస్తాం కనక
డాలర్ ధరనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా చూసినా 2005లో డాలరు విలువ మన కరెన్సీతో పోలిస్తే రూ.45
ఉండగా 2009లో అది రూ.49గా ఉంది. ఇక ఇప్పుడు బ్యారెల్ ధర 50
డాలర్లకు వచ్చినా డాలర్ ధర మాత్రం రూ.63.40 దగ్గరుంది. అంటే
దాదాపు 30-35 శాతం పెరిగినట్లన్న మాట. ఈ లెక్కన పెట్రోలు, డీజిల్
ధరలు కూడా 30-35 శాతం పెరిగాయనుకున్నా బంకుల్లో
లీటరు పెట్రోలు రూ.53.50కు, డీజిల్ రూ.40కి రావాలి.
కానీ బహిరంగ మార్కెట్లో లీటరు పెట్రోలు రూ.67(హైదరాబాద్లో) ఉండగా
డీజిల్ ధర రూ.55గా ఉంది. అంటే ప్రతి లీటరుకూ రూ.14 నుంచి
15 రూపాయలు తగ్గాల్సి ఉండగా తగ్గటం లేదన్నది గమనించాలి.
అంటే ఈ మేరకు వినియోగదారుడికి దక్కాల్సిన ప్రయోజనం ఎక్సైజ్
పన్నుల రూపంలోను కేంద్ర ప్రభుత్వానికి, లాభం రూపంలో పెట్రో
మార్కెటింగ్ కంపెనీలకు, ఇతర పన్నుల రూపంలో
రాష్ట్రాలకు పోతోంది. 2009తో పోలిస్తే రూ.5.75
వరకు ఎక్సయిజు సుంకం రూపంలో పెంచగా, రూ.3 పెట్రో
మార్కెటింగ్ కంపెనీలు లాభాలుగా తీసుకొంటున్నాయి.
భారత ప్రభుత్వం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న
బ్యారెల్ ధర (పాత కాంట్రాక్టు ప్రకారం) 58 డాలర్లుంది. అయితే
సోమవారం ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర 52 డాలర్లకు తగ్గింది. ఇదే
స్థాయిలో మరో 10 రోజులు క్రూడ్ ధర కొనసాగితే... జనవరి 16న
వినియోగదారులకు కొంత ధర తగ్గాలి. లేదా మరికొంత ఎక్సైజ్ సుంకాన్ని
వడ్డించడమైనా జరుగుతుంది. కాకపోతే ధర తగ్గినపుడల్లా ఇలా
పన్నులు వడ్డించి... ధర పెరిగినపుడు దాన్ని వినియోగదారులపై
వడ్డిస్తున్నారన్నదే అందరి ఆందోళన.
అసలెందుకు ఈ పతనం?
చమురుతో భారీగా డాలర్లను పోగేసుకున్న రష్యాను దెబ్బతీయటానికే
అమెరికా షేల్ గ్యాస్ ఉత్పత్తిని పెంచుతోందని
కొందరు చెబుతుండగా ఇరాన్లోని షియాలను దెబ్బతీసేందుకు సౌదీ
సున్నీలు ప్రయత్నిస్తున్నారని మరో వాదన వినిపిస్తోంది. ఇవన్నీ
పక్కనబెడితే అమెరికాలో షేల్ గ్యాస్ (రాతి పొరల నుంచి ఉత్పత్తి చేసేది)
ఉత్పత్తి రెండేళ్లుగా విపరీతంగా వృద్ధి చెందిందనేది కాదనలేని
నిజం. 2012లో అమెరికా వాడకం రోజుకు 18.55 మిలియన్
బ్యారెళ్లుండగా ఉత్పత్తి 11.10 బ్యారెళ్లు.
2014 నాటికి డిమాండ్ అలాగే ఉన్నా షేల్ గ్యాస్తో ఉత్పత్తి
రోజుకు 13.41 బ్యారెళ్లకు చేరింది. ఈ ప్రభావంతో అమెరికా క్రూడ్
దిగుమతులు భారీగా తగ్గాయి. మరో వంక ఒపెక్ దేశాల ఉత్పత్తి
ఏమాత్రం తగ్గలేదు. గతంలో ఇలాంటి
పరిస్థితులు ఎదురైనపుడు ఒపెక్ దేశాలన్నీ కలసి ఉత్పత్తిని
తగ్గించేవి. దాంతో ధర అదుపులోకి వచ్చేది. కానీ ఈసారి ఉత్పత్తిని
తగ్గించడానికి కీలకమైన సౌదీ అరేబియా నో చెప్పేసింది. ధర 20
డాలర్లకు పడిపోయినా ఉత్పత్తిని తగ్గించబోమని తేల్చేసింది.
ఇది అమెరికా సన్నిహిత దేశం కావటంతో సౌదీ వైఖరి పైన పేర్కొన్న
రెండు వాదనలకూ ఊతమిచ్చేటట్లే ఉంది. కానీ తాము ఉత్పత్తిని
తగ్గిస్తే, తమ మార్కెట్ వాటాను రష్యా,
ఇరాన్లు చేజిక్కించుకుంటాయనేది ఒపెక్ భయమని
విశ్లేషకులు చెబుతున్నారు. చమురును భారీగా వినియోగించే చైనా
ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడం, యూరప్,
జపాన్లు మాంద్యం పరిస్థితుల్లో చిక్కుకోవడం వంటి కారణాలతో
చమురుకు డిమాండ్ కొరవడటం ఈ పరిస్థితులకు నిప్పుకు గాలిలా
తోడయింది. అందుకే ఈ పతనం ఎక్కడ ఆగుతుందన్నది
విశ్లేషకుల ఊహలకూ అందటం లేదు.
భారత్కు ఎంతవరకూ లాభం?
ముడి చమురు వినియోగంలో 80 శాతం దిగుమతులపైనే ఆధారపడ్డ
భారత్కు ఇలా ధర తగ్గటం నిస్సందేహంగా లాభమే. అయితే అదే
సమయంలో డాలర్ ధర భారీగా పెరగటం ఈ లాభాన్ని హరించేస్తోంది.
ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర ఆర్నెల్లలో 115 డాలర్ల నుంచి 58
డాలర్లకు చేరటంతో భారత్ చమురు దిగుమతుల బిల్లు బాగా
తగ్గింది. ఎల్పీజీ, కిరోసిన్లకు ప్రభుత్వమిస్తున్న సబ్సిడీ
భారం చాలావరకూ తొలగిపోయింది. కరెంటు ఖాతాలోటు,
ద్రవ్యలోటు బాగా అదుపులోకి వచ్చాయి.
ఇవి విపరీతంగా పెరిగిపోవడంతో 2013 ద్వితీయార్థంలో
పలు ఇబ్బందులు ఎదురవటమే కాక ఒకదశలో రూపాయి విలువ బాగా
పతనమై డాలరు ఏకంగా రూ.68.5కు కూడా చేరింది. క్రూడ్
ధరలు తగ్గటంతో ప్రభుత్వం పెట్రోలు, డీజిల్పై రూ.6
వరకూ ఎక్సైజ్ సుంకం వేసి నిధులు రాబట్టుకుంటోంది. అయితే
క్రూడ్ ధర ఇలా క్షీణించటం కారణంగా చమురు ఉత్పత్తిపై
ఆధారపడ్డ రష్యా, మధ్య ప్రాచ్య దేశాల ఆర్థిక
వ్యవస్థలు దెబ్బతిని, వాటి కొనుగోలు శక్తి దెబ్బతింటుందని, ఆయా
దేశాలకు భారత ఎగుమతులు కూడా తగ్గుతాయనే
ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
విలువ పరంగా ఈ ఎగుమతులు ఇప్పటికే 20
శాతం వరకూ తగ్గాయని కూడా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఆర్థిక వేత్తలు మాత్రం ఇదే అదనుగా భారత్ తన
రిజర్వు సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, విశాఖపట్నం,
పూడూరు, మంగళూరుల్లోని
చమురు రిజర్వాయర్లను నింపుకోవాలని సూచిస్తున్నారు.
దీనివల్ల అత్యవసర పరిస్థితుల్ని తట్టుకునే
సామర్థ్యం లభిస్తుందన్నది వారి సూచన.
No comments:
Post a Comment